: అంతరిక్షంలో మరో అలజడి
అంతులేని ఆశ్చర్యాలకు నిలయం అంతరిక్షం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ పసిగట్టలేరు. అయితే త్వరలో అంతరిక్షంలో ఒక పెద్ద అలజడి సంభవించనుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సృష్టికంతటికీ కాంతి ఆధారం సూర్యుడు. సూర్యుడిలో ఎప్పుడూ సౌర జ్వాలలు ఎగసిపడుతుంటాయి. ఇటీవలే ఈ సౌర జ్వాలల వల్ల సూర్యుడు మరింత వేడిని వెళ్లగక్కాడు. అయితే మరోమారు సూర్యుని అంచులో ఒక భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. ఈ విస్ఫోటనాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తన కెమెరాలో బంధించింది.
నాసా శాస్త్రవేత్తలు సూర్యుడిపై చోటుచేసుకుంటున్న ఈ విస్ఫోటనాన్ని కెమెరాలో బంధించడానికి సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్‌డీఓ) ఉపగ్రహాన్ని ఉపయోగించారు. కరొనల్ మాస్ ఎజెక్షన్‌గా పేర్కొనే ఈ పేలుడు వల్ల సుమారు వంద కోట్ల టన్నుల పదార్ధాలు అంతరిక్షంలోకి దూసుకువస్తాయని, ఇవి గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకెళతాయని నాసా తెలుపుతోంది. అయితే ఇవి భూమి దిశగా మాత్రం రావడం లేదనే చల్లని కబురును కూడా నాసా చెబుతోంది. అంతపేలుడు సంభవిస్తే మన భూమికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడం నిజంగా మన అదృష్టమే కదూ...!