: పల్లెకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టే: నారా లోకేష్
పల్లెకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టేనని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖ తనకు కేటాయించాలని సీఎంను అడిగి మరీ తీసుకున్నానని అన్నారు. రాబోయే ఏడాదిలో 5 వేల జనాభా ఉన్న గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామాల్లో పది వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు నిర్మించామని, ఈ ఏడాది మరో ఆరు వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు నిర్మించనున్నామని చెప్పారు.
డిజిటల్ పంచాయతీలుగా మారుస్తామని, 2019 నాటికి అన్ని గ్రామాలు ఓడీఎఫ్ లు కావాలని, గ్రామాల అభివృద్ధి సర్పంచ్ చేతుల్లోనే ఉందని అన్నారు. రాబోయే రెండేళ్లలో గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని, గ్రామాల్లో వాటర్ ట్యాంకులు నిర్మిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆదాయం వచ్చేలా కృషి చేస్తామని, ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగిందని, గ్రామాల్లో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తామని లోకేష్ చెప్పారు.