: నంద్యాల కౌన్సిల్ సమావేశం రసాభాస.. అఖిల ప్రియపై మండిపడుతున్న శిల్పా వర్గం!
నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారిన నేపథ్యంలో మంత్రి భూమా అఖిలప్రియపై ఫిర్యాదు చేస్తామని శిల్పా వర్గీయులు అంటున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ సులోచన రాకముందే ఈ సమావేశాన్ని మంత్రి అఖిల ప్రియ ప్రారంభించారని ఆరోపిస్తున్నారు. ఈ రోజు జరిగిన నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హోదాలో అఖిలప్రియ తొలిసారిగా పాల్గొన్నారు. అయితే, చైర్ పర్సన్ రాకముందే సమావేశాన్ని ప్రారంభించారు. కొంచెం సేపటి తర్వాత సులోచన వచ్చారు. అయితే, ఆమెకు మాట్లాడే అవకాశాన్ని అఖిల ప్రియ ఇవ్వలేదు.
దీంతో, తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరని సులోచన ప్రశ్నించారు. ఈ క్రమంలో సులోచన భర్త, కో ఆప్షన్ సభ్యుడు సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డుల్లో సమస్యలు ఉంటే చెప్పాలని అడుగుతున్నారే తప్పా, చైర్ పర్సన్ కు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదంటూ అఖిలప్రియను ప్రశ్నించారు. అయితే, కొంచెం సేపటి తర్వాత అఖిలప్రియ అర్థాంతరంగా వెళ్లిపోయారు. ‘కర్నూల్ వెళ్లాల్సి ఉంది, మీరు మాట్లాడుకోండి’ అని అఖిల ప్రియ చెప్పి వెళుతుండగా .. ‘చైర్ పర్సన్ కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎలా వెళ్లిపోతారు?’ అని సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కాగా, ఓ మంత్రి ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధ కలిగించిందని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని సుధాకర్ రెడ్డి అన్నారు.