: బాహుబలి-1లో యుద్ధం కష్టమనిపించింది.. రెండవ భాగంలో మాత్రం చాలా సులువుగా చేశా: రానా
మరో నాలుగు రోజుల్లో బాహుబలి పార్ట్ 2 విడుదల కానున్న నేపథ్యంలో ఆ సినిమాల్లో భల్లాల దేవుడిగా నటించిన రానా ఆ సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బాహుబలి-1లో యుద్ధ సన్నివేశాల వంటి రిస్కీ యాక్షన్ దృశ్యాలు చేయడం మొదటి ప్రయత్నం కావడంతో అవి చేయడం కొంత కష్టమనిపించిందని ఆయన చెప్పాడు. అయితే, పార్ట్ 2లో మాత్రం చాలా సులువుగా అనిపించిందని అన్నాడు. కంప్యూటర్ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్‌ను జోడించడం ప్రతి రోజూ సవాలేనని ఆయన చెప్పాడు.
బాహుబలి చిత్రం భారతదేశ సినీ నిర్మాతలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందనీ, భారీ చిత్రాలను ప్రోత్సహించేలా చేసిందని రానా అన్నాడు. ఇప్పుడు నిర్మాతలు భారీ చిత్రాల వైపుగా ఆలోచించడం అద్భుతమని అన్నారు. ఒక ప్రాంతీయ భాషా సినిమా బాహుబలి ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుందని చెప్పాడు. బాహుబలి-1 అనూహ్యంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిందని, ఇది తమలో నమ్మకాన్ని పెంచిందని అన్నాడు. బాహుబలిలో నటించడం ద్వారా తాను నేర్చుకున్న దాని ఆధారంగా భవిష్యత్తులో పాత్రలను ఎంపిక చేసుకుంటానని చెప్పాడు.