: ఏపీలో 6 ఆటలు, టీఎస్ లో 5 ఆటలు... తలసానితో ఫలించిన 'బాహుబలి' టీం చర్చలు!
ప్రపంచ సినీ అభిమానులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న 'బాహుబలి-2' చిత్రం విడుదల సందర్భంగా కొన్ని రాయితీలు ఇవ్వాలని చిత్ర బృందం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో సాధారణంగా ప్రదర్శించే నాలుగు షోలకు అదనంగా మరో షోను వేసుకునేందుకు వారు అనుమతి కోరారు. దీనికి మంత్రి తలసాని సైతం సానుకూలంగా స్పందిస్తూ, అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు.
టికెట్లన్నీ ఆన్ లైన్ లోనే విక్రయించాలని, ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ కు అవకాశం లేకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా ఆయన చిత్ర నిర్మాతలను కోరారు. ఈ సినిమా కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, సినిమాకు ప్రభుత్వం అన్ని రకాల సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. పది రోజుల పాటు అదనపు షోలకు అనుమతినిస్తూ, ఉత్తర్వులు వెలువరించిన ఆయన, ఆయా షోలకు సంబంధించిన వినోదపు పన్నును ఆలస్యం కాకుండా ప్రభుత్వ ఖజానాకు చేర్చాలని సూచించారు. బ్లాక్ టికెట్లు విక్రయించినట్టు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తలసాని హెచ్చరించారు.
కాగా, ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చిత్రం విడుదలైన తరువాత తొలి పది రోజులూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 2:30 గంటల వరకూ ప్రదర్శనలకు అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో రోజుకు ఆరు షోలను ప్రదర్శించేందుకు అవకాశం లభించినట్లయింది.