: చంద్రబాబు సస్పెండ్ చేసిన ఆ ఇద్దరూ ఎవరు? టీడీపీలో ఎడతెగని చర్చ!
"చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రాంతంలోని ఇసుక స్మగ్లర్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఇద్దరు ఉన్నారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా. వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించాను" నిన్న నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, అక్కడ మీడియాకు చెప్పిన మాటలవి. ఇక చంద్రబాబు, ఆ ఇద్దరి పేర్లను మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆ ఇద్దరూ ఎవరా? అని తెలుగుదేశం పార్టీలో ఎడతెగని చర్చ సాగుతోంది.
మునగలపాళెం వద్ద ఇసుక తవ్వకాల్లో టీడీపీ నేతలే భాగస్వాములని విమర్శలు రావడంపైన, ఇటీవలి ఏర్పేడు ఘోర ప్రమాదంపైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆపై ఓ నివేదిక తెప్పించుకుని, ఆ ఇద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. వీరిలో ఒకరు మాజీ జడ్ పీటీసీ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరొకరు ఎవరా అన్నది తేలడం లేదు. ఇక సొంత పార్టీ నేతలపైనే చంద్రబాబు కఠిన చర్యలకు ఆదేశించడం ఇసుక మాఫియా వెన్నులో వణుకు పుట్టిస్తోంది.