: మందు మానండి బాబూ


మందు బాబులకు మందు మానమని ఎంత చెప్పినా చెవికెక్కదు. ఈ మహమ్మారి వల్ల మీరు చావుకు దగ్గర పడుతున్నారని ఎవరు ఎంత చెప్పినా వారి చెవిదాకా వెళ్లదు. ఇప్పుడు మరోమారు శాస్త్రవేత్తలు మందుబాబులను హెచ్చరిస్తున్నారు. మందు మానకుంటే ఆరోగ్యం మరింతగా చెడిపోయే ప్రమాదముందని మిస్సోరి విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ప్రభావం చూపే కాలేయం విపరీత మద్యపానం వల్ల చాలా సున్నితంగా మారుతుందని, ఫలితంగా దాని పనితీరు మందగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

విపరీతంగా తాగడం వల్ల కాలేయం సున్నితమై ఆ అవయవంలో వాపు తలెత్తుతుంది, ఈ ప్రభావం వల్ల దాని పనితీరు మందగిస్తుంది. ఫలితంగా శరీరంలోని కీలకమైన అవయవాల పనితీరులో తేడా వస్తుంది. అంటే ఒక్క కాలేయం మాత్రమే చెడిపోకుండా దాని ప్రభావం శరీరంలోని వివిధ అవయవాలపై పడుతుంది. ఫలితంగా మరింతగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది. ఈ విషయాలన్నీ మిస్సోరి విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. ఇందులో మన భారతీయ సంతతికి చెందిన శివేంద్ర శుక్లా కూడా ఉన్నారు. కొద్దిసేపు ఈ లోకం నుండి దూరంగా మైకంలోకి వెళ్లేలా చేసే మందును తాగడం ద్వారా త్వరగా శాశ్వతంగా ఈ లోకానికి దూరం కావడం అవసరమంటారా... మందుబాబులూ ఇకనైనా మందు మానండయ్యా...!

  • Loading...

More Telugu News