: రెండు నెల్లలో 200 మంది అమ్మాయిలకు నరకం చూపించిన ఆర్టీసీ కండక్టర్.. పాపం పండి కటకటాల వెనక్కి!
అటువైపు ఉన్నది అమ్మాయి అయితే చాలు.. ఇక వీళ్లు రెచ్చిపోతారు. వారి మొబైల్ ఫోన్లకు అసభ్య మెసేజ్‌లు పంపి తమలోని శాడిజాన్ని చాటుకున్నారు. చివరికి పాపం పండి కటకటాల పాలయ్యారు. ఇలా రెండు నెలల్లో రెండు వందల మంది అమ్మాయిలను వేధించిన ఆర్టీసీ కండక్టర్ సహా మరో వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ మండలం సహాయ కమిషనర్ కంచి శ్రీనివాసరావు కథనం ప్రకారం..
విజయవాడ రూరల్ మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన పమిడిపాటి శ్రీనివాసరావు (39) గవర్నరుపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్. రూట్ నంబరు 48 (అజిత్‌సింగ్ నగర్) బస్సుకు రెగ్యులర్ కండెక్టర్ అయిన శ్రీనివాసరావుకు జులాయిగా తిరిగే పాస్టర్ కుమారుడు మార్లపూడి శామ్యూల్ (30)తో స్నేహం కుదిరింది. విద్యార్థినుల పాస్‌లను చెక్‌చేసే క్రమంలో శ్రీనివాసరావు వాటిపై ఉన్న వారి ఫోన్ నంబర్లను గుర్తుపెట్టుకుని రాసుకునేవాడు. ఇక హడావుడిగా బస్సు దిగే క్రమంలో కొందరు అమ్మాయిలు బస్సులో మర్చిపోయే ఫోన్ల నుంచి నంబర్లు సేకరించేవాడు.
డ్యూటీ అనంతరం శామ్యూల్‌తో ఈ విషయాలను పంచుకునేవాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి సేకరించిన ఫోన్ నంబర్లకు అసభ్య సందేశాలను పంపిస్తూ పైశాచిక ఆనందం పొందేవారు. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందలమందిని ఒక్క విజయవాడలోనే రెండు నెలల కాలంలో 200 మంది యువతులకు చూడాలంటేనే భయపడేలా అసభ్య మెసేజ్‌లు పంపారు. చివరికి కండక్టర్ శ్రీనివాసరావు తన భార్యకు కూడా అసభ్య సందేశాలు పంపేవాడు. దొరికిపోకుండా ఎప్పటికప్పుడు నంబర్లు మార్చి జాగ్రత్త పడేవాడు.
ఇటీవల శ్రీనివాసరావు విధి నిర్వహణలో ఉండగా బస్సులో ఓ వ్యక్తి మూర్ఛ వచ్చి పడిపోయాడు. దీంతో ఆయన సెల్ తీసుకుని ఆయన కుమార్తెకు సమాచారం అందించాడు. పనిలో పనిగా ఆమె నంబరును రాసుకున్నాడు. రెండు రోజుల తర్వాతి నుంచి ఆ అమ్మాయికి అసభ్య సందేశాలు వెల్లువెత్తాయి. రోజూ ఫోన్ చేసి నాన్నకు ఎలా ఉందంటూ పరామర్శించేవాడు. దీంతో అతడి తీరుపై అనుమానంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు బయటపడింది. శ్రీనివాసరావు తరచూ నంబర్లు మార్చినా ఒకే ఫోన్ నుంచి మెసేజ్‌లు చేస్తుండడంతో దొరికిపోయాడు. ఒకే ఐఎంఈ నంబరు నుంచి వేలాది మెసేజ్‌లు వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు అవాక్కయ్యారు. తొలుత శామ్యూల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిచ్చిన సమాచారంతో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి పంపారు.