: టీఆర్ఎస్ వరంగల్ సభలో భారీ వేదిక.. 600 మంది కూర్చునేలా ఏర్పాట్లు!
వరంగల్ నగరంలో ‘తెలంగాణ ప్రగతి నివేదన’ పేరిట ఈనెల 27న నిర్వహించనున్న టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. 600 మందికిపైగా కూర్చునేలా తీర్చిదిద్దుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్లీనరీలో వేదిక చిన్నగా ఉండడంతో కొందరికి మాత్రమే దానిపై చోటు లభించింది. దీంతో చోటు దొరకని వారు అసంతృప్తికి లోనయ్యారు. వారి అసంతృప్తిని పరిగణనలోకి తీసుకున్న టీఆర్ఎస్ అధిష్ఠానం వరంగల్ సభలో ముఖ్యమైన నేతలందరికీ వేదికపై చోటు కల్పించాలని నిర్ణయించింది.
ఈ మేరకు భారీ వేదికను రూపొందించాలని అధిష్ఠానం నుంచి జిల్లా నేతలకు ఆదేశాలు అందాయి. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానున్న సభకు మధ్యాహ్నం నుంచే కార్యకర్తలను తరలించాలని ఆదేశించింది. తన నియోజకవర్గం నుంచి కార్యకర్తలను తరలించేందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు రైలు సౌకర్యం కల్పిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, భువనగిరి నుంచి కార్యకర్తలను తరలించేందుకు రైళ్ల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇక సభకు హాజరయ్యే కార్యకర్తలపై హెలికాప్టర్‌తో పూలవర్షం కురిపించాలని అధిష్ఠానం యోచిస్తోంది.