: 'డీఎస్ పీ'కి కొత్త నిర్వచనం చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) మరో లైవ్ స్టేజ్ ప్రోగ్రామ్ కు సిద్ధమయ్యారు. ఇటీవల అమెరికాలో తన ‘షో’కు మంచి స్పందన రావడంతో మరింత ఉత్సాహంగా ఉన్న దేవీశ్రీ ప్రసాద్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో టూర్ వివరాలను డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, స్రవంతి రవికిషోర్, జెమిని కిరణ్, డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, డీఎస్ పీ అంటే ప్రత్యేక నిర్వచనం చెప్పారు. డీ అంటే డెడికేషన్, ఎస్ అంటే స్ట్రాటజిక్, పి అంటే పాపులేషన్ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. దేవీశ్రీ ప్రసాద్ తమ ఇంట్లో కుర్రాడని, అతని విద్వత్ చూస్తుంటే తనకు చాలా ముచ్చటేస్తోందని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ కొత్త టూర్ ప్రోగ్రామ్ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని కోరారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని దివ్యాంగులైన పిల్లలకు ఇవ్వాలని డీఎస్పీ చెప్పడం చాలా సంతోషమని.. అభినందిస్తున్నానని మెగాస్టార్ ప్రశంసించారు. అంతకు ముందు, దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, యూఎస్ లో తాను చేసిన టూర్ సక్సెస్ అయిందని, లైవ్ పర్ఫ్మెన్స్ షోలను ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు.