: 'పొలిటికల్ పంచ్' రవికిరణ్ గతంలో 14 రోజులు జైల్లో ఉన్నాడు... క్రిమినల్స్ ను వైసీపీ వెనకేసుకొస్తోంది: సోమిరెడ్డి
శాసనసభ, మండలిని ఉద్దేశిస్తూ అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియాలో పెట్టాడన్న ఆరోపణలతో 'పొలిటికల్ పంచ్' అడ్మిన్ రవికిరణ్ ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని, విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.
క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులతో సోషల్ మీడియాను వైసీపీ నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. 2014లో రవికిరణ్ 14 రోజుల పాటు జైల్లో ఉన్నాడని చెప్పారు. జగన్, విజయసాయిరెడ్డిలు క్రిమినల్స్ ను వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. అధికారులను విజయసాయిరెడ్డి బెదిరించడం సరికాదని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం జగన్ కు అలవాటేనని... చట్టానికి ఎవరూ అతీతులు కాదని తెలిపారు.