: కొనసాగుతున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు.. ఓటేసిన పలువురు ప్రముఖులు
బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మూడు కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 272 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 1.30 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
గత పదేళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారంలో ఉన్న బీజేపీ... ఈ సారి కూడా అధికారాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయాన్ని నమోదు చేసినప్పటికీ... ఆ తర్వాత ఆ పార్టీ వెలుగు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలను చేస్తోంది.
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆయన సతీమణితో కలసి వచ్చి ఓటు వేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 26న వెలువడనున్నాయి.