: తనను లోకేష్ అవమానించారన్న వార్తపై మంత్రి జవహర్ స్పందన
ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల కథనాలు విచ్చల విడిగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు కథనాలు రాయడం, పోస్ట్ చేయడం పరిపాటిగా మారింది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? అనే ఆలోచన కూడా లేకుండా వాటిని షేర్ చేయడం మరో ట్రెండ్. ఈ నేపథ్యంలో, అనేక కథనాలు (తప్పు కావచ్చు, కరెక్ట్ కావచ్చు) గంటల వ్యవధిలో లక్షల మందికి చేరిపోతున్నాయి. తాజాగా ఇలాంటి కథనం ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే, మంత్రి జవహర్ ను నారా లోకేష్ అవమానించారనేది. తన ఛాంబర్ ఎదుట కూర్చున్న జవహర్ ను లోకేష్ పట్టించుకోలేదని, గంట సేపు బయటనే వెయిట్ చేయించారనేది ఆ కథనం. ఈ వార్తపై స్వయంగా జవహర్ స్పందించారు.
ఈ వార్త పూర్తిగా కల్పితమని జవహర్ అన్నారు. తాను మంత్రిగా బాధ్యతలను స్వీకరించేందుకు మరో గంట సమయం ఉన్న నేపథ్యంలో... తన ఛాంబర్ ముందే లోకేష్ ఛాంబర్ కూడా ఉండటంతో ఆయనను కలిసేందుకు వెళ్లానని... ఆ సమయంలో ఆయన ఐటీ శాఖ అధికారులతో బిజీగా ఉన్నారని... దాంతో, తాను వచ్చినట్టు లోకేష్ కు చెప్పమని అక్కడున్న సిబ్బందికి చెప్పానని తెలిపారు. ఆ సమాచారం లోకేష్ కు చేరడానికి 10 నిమిషాల సమయం పట్టిందని... సమాచారం తెలుసుకున్న వెంటనే తనను లోపలకు రమ్మని చెప్పారని ఆయన అన్నారు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఈ సమయం పట్టిందని చెప్పారు. తాను ఛాంబర్ లో ఉన్నప్పుడు... బయట ఎవరు ఉన్నారో తనకు మాత్రం ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. లోకేష్ విషయంలో కూడా ఇదే జరిగిందని... తనను ఆయన అవమానించలేదని చెప్పారు. ఈ కథనాలను నమ్మరాదని సూచించారు.