: తెలుగువారిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు: నటుడు అజయ్
ఇటీవల జరిగిన ఓ తమిళ సినిమా వేడుకలో తెలుగు సినిమాలు, దర్శకులు, ప్రజల గురించి నటుడు అజయ్ చులకనగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలపై తెలుగు వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, తాను అన్న మాటలకు వివరణ ఇచ్చాడు అజయ్. తాను కావాలని ఏదీ అనలేదని... సరాదాగా అన్నానని అజయ్ చెప్పాడు. సినిమా అవకాశాల కోసం హైదరాబాదులో ఎన్నో ఏళ్లు కష్టపడ్డానని... అవమానాలు భరించానని చెప్పాడు.
చిన్నచిన్న సినిమాల్లో చేస్తున్న సమయంలోనే తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఓ సినిమాలో అవకాశం ఇచ్చారని... ఆ తర్వాత తనకు అవకాశాలు పెరిగాయని తెలిపాడు. అంతకు ముందు వరకు తనకు సీరియల్సే తిండి పెట్టాయని చెప్పాడు. దక్షిణాదికి మూలమైన తమిళ సినిమాను పొగిడానే తప్ప, తెలుగు సినిమాలను తాను కించపరచలేదని అన్నాడు. తాను ఎలాంటి వ్యక్తినో టాలీవుడ్ లో ఎంతో మందికి తెలుసని చెప్పాడు. తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా మనస్తాపానికి గురైతే... వారికి క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు.