: లాలూకు రూ.1000 కోట్ల బినామీ ఆస్తులు.. సుశీల్ మోదీ ఆరోపణ
ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్ కుటుంబానికి రూ.1000 కోట్ల విలువైన బినామీ ఆస్తులు ఉన్నట్టు బీహర్‌కు చెందిన బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డిలైట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్జేడీ ఎంపీ ప్రేంచంద్ గుప్తా, ఓం ప్రకాశ్ కత్యాల్‌లకు చెందిన కంపెనీలతోపాటు ముంబైకి చెందిన ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను తమ కుటుంబ సభ్యుల పేర్లతో బదలాయించుకోవడం ద్వారా వీటిని సంపాదించినట్టు ఆయన ఆరోపించారు.
ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలో ఏబీ ఎక్స్‌పోర్ట్స్‌కు ఉన్న రూ.155 కోట్ల ఆస్తిని లాలు దక్కించుకున్నారని సుశీల్ మోదీ ఆరోపించారు. లాలుప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 2007-08లో ఈ వ్యవహారం జరిగిందని వివరించారు. ఏబీ ఎక్స్‌పోర్ట్స్‌లో 2011లో లాలు కుమారుడు, ప్రస్తుత బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ ప్రసాద్, 2014లో లాలు మరో కుమారుడు తేజ్ ప్రతాప్ డైరెక్టర్లు అయ్యారన్నారు. ప్రస్తుతం వారికి బదులు ఆయన కుమార్తెలు రాగిణి, చందాలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని సుశీల్ మోదీ డిమాండ్ చేశారు.