: శాన్‌ఫ్రాన్సిస్కో వాసులకు చుక్కలు చూపించిన కరెంట్!
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో వాసులకు కరెంట్ చుక్కలు చూపించింది. భయంకరమైన అనుభవాన్ని మిగిల్చింది. ఆ ప్రాంతంలోని ఓ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి కరెంట్ పోయింది. దానిని సరిదిద్ది విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు వారికి నాలుగు గంటలు పట్టింది. ఈ నాలుగు గంటలు ప్రజలు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఆ ప్రాంతం దాదాపు స్తంభించిపోయింది. హఠాత్తుగా కరెంట్ పోవడంతో ఎక్కడి లిఫ్ట్‌లు అక్కడ ఆగిపోయాయి. వందలాది మంది అందులో చిక్కుకుపోయారు.
ఏం జరుగుతుందో తెలియక చీకట్లో హాహాకారాలు చేశారు. తమను రక్షించే వారికి కోసం కేకలుపెట్టారు. లక్షలాదిమంది చీకట్లో చిక్కుకుపోయారు. రోడ్లు సిగ్నళ్లు పనిచేయడం మానేశాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆస్పత్రిలో రోగులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు, విద్యుత్ లేక అత్యవసర సేవలు ఆగిపోయాయి. అప్పటికప్పుడు చేయాల్సిన సర్జరీలు ఆగిపోయాయి. మెట్రో రైళ్లు, కేబుల్ కార్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు 9 లక్షల మంది ప్రజలు కరెంట్ కష్టాలు ఎదుర్కొన్నారు.