: ప్రత్యేక వై-ఫై హాట్ స్పాట్ ల ద్వారా రూ.10 కంటే తక్కువ ధరకే డేటా: కేంద్ర ప్రభుత్వం
డిజిటల్ ఇండియా కోసం కృషి చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం... ప్రత్యేకంగా రూపొందించిన వై ఫై హాట్ స్పాట్ ల ద్వారా రూ.10ల కంటే తక్కువ ధరకే డేటాను అందించడానికి ప్రయత్నాలు జరుపుతోంది. ఈ క్రమంలో టెలికాం శాఖామంత్రి మనోజ్‌సిన్హా నిన్న ప్రభుత్వరంగ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(సీ-డాట్) అభివృద్ధి చేసిన పబ్లిక్ డాటా ఆఫీస్(పీడీవో)ను ప్రారంభించారు. మరో మూడు నెలల్లోనే దేశీయ తయారీదారులకు ఈ టెక్నాలజీని అందించాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది.
దీంతో పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లలా పబ్లిక్ డేటా ప్యాక్‌ల బూత్‌లు అందుబాటులోకి రానున్నాయి. వీటితో చౌకగా వై-ఫై సేవలు అందుకోవచ్చు. పీడీవో నుంచి 2జీ, 3జీ, 4జీ సిగ్నల్స్ ద్వారా వై-ఫై హాట్‌స్పాట్‌ను ఏర్పాటు చేసి 500 మీటర్ల పరిధిలో వంద మొబైళ్లకు నెట్ కనెక్ట్ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న మొబైల్ టవర్స్ ద్వారా కూడా ఈ సర్వీసును అందుకోవచ్చని చెప్పారు. దాదాపు 50వేల యూనిట్లను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.