: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. చికెన్ తింటున్నాడని విడాకులు తీసుకుంది!
మతాలు వేరయినా ఓ యువకుడిని ప్రేమించింది.. తమ తల్లిదండ్రులు వద్దని ఎంత వారించినా వినకుండా తాను కోరుకున్న ప్రియుడినే పెళ్లి చేసుకుంది. అయితే, గత ఐదేళ్లుగా తన భర్త తనకు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవడం లేదని, మాంసాహారం తింటున్నాడని, వేధింపులకు గురి చేస్తున్నాడని ఆ యువతి ఇప్పుడు విడాకులు తీసుకోవడం కోసం కోర్టుకెక్కింది. పూర్తి వివరాలు చూస్తే.. ఆరేళ్ల క్రితం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉండే జైన మతానికి చెందిన రీమా అనే యువతి బీహార్‌కు చెందిన కరణ్‌ను ప్రేమించింది. ఆ యువతి డిగ్రీ చదువుతుండగా కరణ్ వృత్తి రీత్యా కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తుండగా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో ప్రేమ అనే బంధం కలిపింది.
వారిద్దిరి పెళ్లి జరిగిన తరువాత తాను జైన మతస్తురాలిని కాబట్టి తన భర్త కూడా మాంసాహారానికి దూరంగా ఉండాలని ఆమె కోరుకుంది. ఆ విషయాన్ని తన భర్తతో చెప్పగా అతడు ఒప్పుకున్నాడు. అందు కోసం మాటిచ్చాడు గానీ, దాన్ని ఆచరణలో పెట్టలేదు. అప్పుడప్పుడు బయటకు వెళ్లి చికెన్ తిని ఇంటికి వచ్చేవాడు. ఈ విషయంలో రీమా, కరణ్ పలుమార్లు గొడవ పడుతూ ఉండేవారు. వారిద్దరి దాంపత్యానికి చిహ్నంగా కవల పిల్లలు కూడా పుట్టారు. అయితే, కరణ్ ఈ మధ్య అధికంగా మాంసాహారం తినేస్తున్నాడు. దీంతో తనకు విడాకులు కావాలని కోరుతూ రీమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ భార్యాభర్తల మధ్య పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకునేందుకు అంగీకారం కుదిరింది.