: బొజ్జల, లోకేష్ కు చేదు అనుభవం...గ్రామస్తులకు సమాధానం చెప్పలేక వెనుదిరిగిన నేతలు
ఏర్పేడు ఘటనలో మృతిచెందిన మునగళపాలెం గ్రామంలో మంత్రి లోకేష్, మాజీ మంత్రి బొజ్జలకు చేదు అనుభవం ఎదురైంది. ఇసుక మాఫియా వెనుక ఉన్నది మీ మనుషులు కాదా? అంటూ మృతుడి భార్య నిలదీశారు. మీరు పది లక్షలు ఇవ్వడం కాదు...అవే పది లక్షల రూపాయలను నేను మీకు ఇస్తాను...నా భర్తను మీరు వెనక్కి తీసుకురండి అని ఆమె సవాలు విసిరారు. గ్రామంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది, చర్యలు తీసుకోండి అంటూ పలుమార్లు గ్రామం నుంచి రిప్రజెంటేషన్ ఇస్తే పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు.
న్యాయం చేస్తామని పరామర్శించేందుకు వచ్చిన మీరు...తమ వారిని పొట్టన బెట్టుకుని ఏం న్యాయం చేస్తారని ఆమె అడిగారు. అమరావతిలో రోడ్లేసుకోవడం కాదు...గ్రామాలను కూడా పట్టించుకోండి అంటూ ఆమె నిలదీశారు. ఆమె రోదనతో బొజ్జల కూడా కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ, ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అన్నారు. గ్రామంలో చాలా మంది హైదరాబాదులో ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు చేస్తున్నారని, అలాగే బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నారని, వారందర్నీ సంప్రదాయబద్దమైన కర్మకాండలు ముగిసిన తరువాత అమరావతికి రమ్మని పిలిచామని, ఆ తరువాత వారి భవిష్యత్ గురించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.