: విదేశాల్లో సంపాదించి డబ్బు పంపట్లేదు... ఇండియాకు భారీగా తగ్గిన రెమిటెన్స్: ప్రపంచ బ్యాంకు కీలక నివేదిక
గత సంవత్సరం విదేశాల నుంచి భారత్ కు వచ్చే రెమిటెన్స్ 8.9 శాతం తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ, విదేశాల నుంచి అత్యధికంగా డబ్బును అందుకుంటున్న దేశంగా తొలి స్థానంలో ఇండియా కొనసాగిందని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వరుసగా రెండో సంవత్సరం విదేశాల నుంచి ప్రజలు పంపే డబ్బులు తగ్గాయని, గత ముప్పై సంవత్సరాల్లో వరుసగా రెండు సంవత్సరాలు రెమిటెన్స్ తగ్గడం ఇదే తొలిసారని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.
చమురు ధరలు తగ్గడం, పలు దేశాల్లో ద్రవ్య విధానాలు కఠినం కావడం, ఉగ్రవాద భయాలు, విదేశాలకు వలస వెళుతున్న ప్రజల సంఖ్య తగ్గడం, యూరో విలువ పతనం వంటి కారణాలతో పాటు ఆదాయపు పన్ను శాఖల కఠిన నిర్ణయాలు కూడా రెమిటెన్స్ తగ్గడానికి కారణమని పేర్కొంది. 2015లో ఇండియాకు 68.9 బిలియన్ డాలర్ల డబ్బు విదేశాల నుంచి రాగా, 2016లో అది 62.7 బిలియన్ డాలర్లకు తగ్గిందని ప్రపంచ బ్యాంకు తెలియజేసింది. మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాలకు వచ్చిన రెమిటెన్స్ 440 బిలియన్ డాలర్ల నుంచి 2.4 శాతం తగ్గి 429 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపింది. ఇక అన్ని దేశాలనూ కలిపి పరిశీలిస్తే రెమిటెన్స్ 582 బిలియన్ డాలర్ల నుంచి 1.2 శాతం తగ్గి 575 బిలియన్ డాలర్లకు చేరిందని ఈ నివేదిక తెలిపింది.