: 6,096 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన హెచ్డీఎఫ్సీ
పెరుగుతున్న ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ కారణాలతో పలు మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న వేళ, ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ సైతం అదే దారిలో నడిచింది. గడచిన రెండో త్రైమాసికంలో ఏకంగా 6,096 మంది ఉద్యోగులను తొలగించింది. డిసెంబర్ 2016లో సంస్థలో 90,421 మంది ఉద్యోగులు ఉండగా, మార్చి 2017 నాటికి ఈ సంఖ్య 84,325కు తగ్గింది. సంస్థ చరిత్రలో మూడు నెలల కాల వ్యవధిలో ఇంత మంది ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారని తెలుస్తోంది.
అంతకుముందు డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలోనూ సంస్థ 4,581 మందిని తగ్గించుకుంది. సంస్థను వీడి రాజీనామా చేసి వెళ్లిపోతున్న వారి స్థానంలో కొత్త ఉద్యోగులను తీసుకోవడం లేదని, డిజిటల్ లావాదేవీల సంఖ్య పెరుగుతూ, బ్యాంకులకు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గడంతో, తమ సేవలను రీ బ్యాలెన్స్ చేసుకుంటున్నామని సంస్థ డిప్యూటీ ఎండీ పరేష్ సుక్తాంకర్ వెల్లడించారు. కాగా, ఏడాదికి 300 నుంచి 400 వరకూ కొత్త శాఖలను ప్రారంభిస్తూ వచ్చిన హెచ్డీఎఫ్సీ, గత సంవత్సరం 195 బ్రాంచీలనే ప్రారంభించింది. అయితే, ఉద్యోగుల తగ్గింపు ప్రభావం బ్యాంకు అభివృద్ధిపై ఎంతమాత్రమూ లేదని సుక్తాంకర్ వెల్లడించడం గమనార్హం.