: వాతావరణ విచిత్రం... 40 డిగ్రీలకు పైగా ఎండలో ఉరుములతో కూడిన వర్షాలు నేడు!
నేడు తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతను మించి రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇదే సమయంలో అల్పపీడనం కారణంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే రెండు మూడు రోజుల్లో ఎండలు మరింతగా పెరగవచ్చని హెచ్చరించింది. కాగా, నిన్న ఆదిలాబాద్ లో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగింది. భద్రాచలం, హైదరాబాద్ లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మిగతా అన్ని జిల్లాల్లో వేడిమి 42 డిగ్రీలను దాటింది. వడదెబ్బ కారణంగా నలుగురు మృతి చెందినట్టు సమాచారం అందింది.