: అందంగా ఉండడమే శాపమైంది... భర్త అరాచకాలపై బెంగళూరు కమిషనర్ ను ఆశ్రయించిన మహిళ


ప్రతి యువకుడూ తనకు అందమైన భార్య రావాలని కోరుకుంటాడు. కానీ అందమైన భార్య దొరికిన ఒక వ్యక్తి మాత్రం తన భార్యకు నరకం చూపించాడు. అందంగా ఉండడమే ఆమెపాలిట శాపంగా మారింది. దీంతో ఆమె స్నేహితుల సహాయంతో బెంగళూరు పోలీస్ కమిషనర్ ను ఆశ్రయించింది. ఈ ఘటనపై కమిషనర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు, బాధితురాలి పేర్లు గోప్యంగా ఉంచారు...బెంగళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో పని చేసే యువతికి అన్నివిధాల తగిన వరుడంటూ పెద్దలు యువకుడ్ని ఎంపిక చేసి కట్టబెట్టారు. వారిద్దరికీ బాబు పుట్టాడు. ఇప్పుడు ఆ బాబుకి నాలుగేళ్లు.

 అయితే వివాహం తరువాత ఆమెకు తన భర్త సంగతి తెలిసివచ్చింది. అందంగా ఉందంటూ ప్రతిక్షణం అనుమానంగా చూసేవాడు. ఆమెను కనీసం ఇల్లు దాటనిచ్చేవాడు కాదు. ఎవరితో మాట్లాడినా అనుమానంగా చూసేవాడు. ఆఫీస్ కు వెళ్తూ ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లేవాడు. ఆఖరుకి ఆమె పుట్టింటి వారితో కూడా ఎక్కువ మాట్లాడవద్దని నిబంధన విధించాడు. అదే ఫోన్ తో ఇంకెవరితోనైనా మాట్లాడుతుందేమోనని ఆందోళన పడేవాడు. అందంగా ఉండడంతోనే ఈ సమస్య అని ఆమెకు శిరోముండనం చేయించాడు. కొడుకుకి నాలుగేళ్ల వయసు వచ్చిందని, వాడు స్కూలు కెళ్లాక ఇంట్లో కూర్చుని ఏం చేయాలంటూ ఆమె ప్రశ్నించడంతో ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించి రక్తసిక్తం చేసేశాడు. దీంతో విసిగిపోయిన ఆమె స్నేహితురాళ్ల సాయంతో బెంగళూరు పోలీసు కమిషనర్ ను ఆశ్రయించింది. దీంతో అనుమానం పిశాచి దారుణాలు వెలుగు చూశాయి. 

  • Loading...

More Telugu News