: ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తే వెంటనే కేసులు ఫైల్ చేయండి: కేసీఆర్
హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో ఈ రోజు నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముగింపు ఉపన్యాసం చేశారు. తనను టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక మాఫియా విచ్చలవిడిగా ఉండేదని, తమ ప్రభుత్వం ఇసుక పాలసీని బ్రహ్మాండంగా రూపొందించిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరయినా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తే వెంటనే వారిపై కేసులు ఫైల్ చేయాలని కేసీఆర్ అన్నారు. ఏ శాఖపై ఆరోపణలు చేస్తే ఆయా శాఖల అధికారులు కేసులు పెట్టాలని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆయన అన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే ఇక ఊరుకోబోమని అన్నారు. అవినీతి రహితంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని చెప్పారు. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ల నియామకంలో అన్ని వర్గాల వారికి అవకాశం కల్పిస్తున్నామని కేసీఆర్ అన్నారు. మార్కెట్లలో దళారీ వ్యవస్థ ఉండకుండా చేస్తామని అన్నారు. రైతులకు లబ్ధి చేకూరేలా ఇప్పటికే తాను ఎరువులు ఫ్రీగా ఇస్తానని ప్రకటించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని రైతులంతా సంఘటితం కావాలని ఆయన అన్నారు.