: తమిళనాట కొత్త పార్టీ స్థాపించిన దీప భర్త మాధవన్
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాట కొత్త పార్టీ ఆవిర్భవించింది. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ భర్త మాధవన్ ‘ఎంజీఆర్ జయలలిత డీఎంకే కజగం’ అనే కొత్త పార్టీని స్థాపించారు. చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ఉన్న జయలలిత సమాధిని ఈ రోజు ఆయన సందర్శించారు. ఎంజీఆర్, జయలలితకు నివాళులర్పించారు. అనంతరం, పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ, ‘అమ్మ’ జయలలితను నిజంగా అనుసరించే వాళ్ల మద్దతు తనకు ఉందని అన్నారు. తన భార్య దీప ఇటీవల ఏర్పాటు చేసిన ఎంజీఆర్ అమ్మ దీప పెర్వాయి పార్టీలో తాను స్వతంత్రంగా పని చేయలేనని.. అందుకు, కొన్ని దుష్ట శక్తులే కారణమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఎంజీఆర్ జయలలిత డీఎంకే కజగం’ అనే కొత్త పార్టీని స్థాపించాల్సి వచ్చిందన్నారు. దీపతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, తన పార్టీలో దీప చేరాలని నిర్ణయించుకుంటే కీలక పదవి ఇస్తానని ఆయన అన్నారు.