: చిత్తూరు ఘోర రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి... రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు
చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో ఈ రోజు మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలికి కలెక్టర్ ప్రద్యుమ్న బయలుదేరారు. మరోవైపు ఈ ఘోరప్రమాదంపై స్పందించిన హోం మంత్రి చినరాజప్ప తిరుపతి అర్బన్ ఎస్పీతో ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేశారు. గాయాలపాలయిన వారిని రుయా, స్విమ్స్, శ్రీకాళహస్తి సీహెచ్సీ ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడి ట్రాఫిక్ ను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.