: వెరైటీ వెడ్డింగ్: డిప్లొమా సర్టిఫికెట్‌ని పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి!


హూస్టన్‌కి చెందిన ఏంజీ అనే ఓ యువ‌తి టెక్సాస్‌ యూనివర్సిటీ విద్యార్థిని. వ‌చ్చేనెల‌ 13న జరగబోయే త‌న వివాహానికి ఆమె త‌న బంధుమిత్రులంద‌రికీ ఆహ్వానం పంపింది. అందులో ఆశ్చ‌ర్యం ఏముందీ అనుకుంటున్నారా? ఆమె పెళ్లి చేసుకోబోయేది గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక అందుకునే డిప్లొమా సర్టిఫికెట్‌ని! ఇటీవ‌లే ఆమె డిగ్రీ పూర్తిచేసి డిప్లొమా స‌ర్టిఫికెట్‌ అందుకుంది. మొత్తం మూడు డిగ్రీలు పూర్తి చేసిన ఏంజీ.. ఈ గ్రాడ్యుయేషన్‌ అనేది జీవితంలో ఒకసారే వస్తుందని, అందుకే ఆ స‌ర్టిఫికెట్‌నే పెళ్లి చేసుకోనున్నాన‌ని చెప్పింది. దీంతో ఈ విచిత్ర పెళ్లి అంత‌ర్జాతీయంగా వార్త‌ల్లోకి ఎక్కింది.
 
పైగా ఈ పెళ్లిని చాలా పద్దతిగా చేసుకుంటోంది. త‌న పెళ్లి వేడుక కోసం ఆమె... పెళ్లి దుస్తులు, సంగీత్‌, కేక్‌ అన్నీ ఏర్పాటు చేసుకుంది. త‌న పెళ్లి విశేషాలు చెప్ప‌డానికి ఓ వెబ్‌సైట్‌ని కూడా క్రియేట్‌ చేసింది. మహిళలు పెళ్లి, కెరీర్‌ అనే రెండు విషయాల్లో ఏదో ఒక్క‌దాన్ని సెలెక్ట్ చేసుకోవ‌డానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటార‌ని, పెళ్లే ప్ర‌ధాన‌మ‌నుకుంటే అంగరంగ వైభవంగా వేడుక జరుపుకుంటారని అంటోంది ఈ విచిత్ర‌ పెళ్లి కూతురు. అయితే, మ‌హిళ‌లు చదువుకున్న చదువు గురించి మాత్రం ఇంత గొప్పగా చెప్పుకోరని చెప్పింది. తాను చేసుకుంటున్న ‘గ్రాడ్యూ వెడ్డింగ్‌’ ద్వారా తాను సాధించిన చదువు గురించి అందరికీ గొప్పగా చాటిచెప్పాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. మ‌హిళ‌లంద‌రూ విద్య‌కు ప్రాముఖ్య‌త‌నివ్వాల‌ని ఆమె సందేశాన్నివ్వాల‌నుకుంటోంది.

  • Loading...

More Telugu News