: ఎగిరే కారుకి త్వరలో ఆర్డర్ల బుకింగ్.. ధర 10 కోట్లు!
భవిష్యత్ అంతా రోబోల మయం. స్టార్ వార్స్ సినిమాల్లోలా రోడ్డుమీద రయ్యిన దూసుకుపోయే కారు అకస్మాత్తుగా అడవిలోకి ఎగిరిపోతుంది. ఈ మేరకు ఆటోమొబైల్ రంగంలో ప్రయోగాలు ఊపందుకున్నాయి. ఇక భవిష్యత్ మొత్తం ఎగిరేకార్లు ఆక్రమిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ఎగిరే కార్ల తయారీ ఊపందుకుంది. స్లోవేకియాకు చెందిన ఏరోమొబిల్ అనే ఆటోమొబైల్ సంస్థ కమర్షియల్ డిజైన్ లో ఫ్లయింగ్ కారును తయారు చేసింది. మొనాకోలో జరిగిన ఆటోషోలో ఈ కారును ఆవిష్కరించింది. ఏరోమొబిల్ తయారు చేసిన ఈ ఎగిరే కారు కేవలం మూడు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే ఫ్లయింగ్ మోడ్ లోకి మారుతుంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు మామూలు స్థితికి వస్తుందని ఈ సంస్థ ప్రకటించింది.
ఈ కారుకు ముందస్తు ఆర్డర్లు త్వరలో ప్రకటించనున్నామని తెలిపింది. బుక్ చేసుకున్న వినియోగదారులకు 2020 నాటికి ఈ కార్లను డెలివరీ చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. అందులో భాగంగా తొలి ఎడిషన్ పేరిట 500 కార్లను ఉత్పత్తి చేస్తామని ఏరోమొబిల్ పేర్కొంది. ఈ కారు ధర 1.29 మిలియన్ డాలర్ల (8 కోట్ల రూపాయల) నుంచి 1.61 మిలియన్ డాలర్ల (10 కోట్ల రూపాయల) మధ్య ఉంటుందని తెలిపింది.