: మోదీతో సన్మానం చేయించుకుని, గంటల వ్యవధిలో అదృశ్యం... ఒడిశాలో కలకలం
ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో పర్యటించిన వేళ, ఆయనతో సన్మానం చేయించుకునేందుకు వెళ్లిన ఓ స్వాతంత్ర్య పోరాట యోధురాలి కుటుంబం, ఆపై గంటల వ్యవధిలో అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మొత్తం 17 మందిని సన్మానించాలని మోదీ నిర్ణయించగా, అందులో జయపురానికి చెందిన దివంగత లక్ష్మీ పండా కుటుంబం కూడా ఉంది. వారిని సన్మానానికి తేవాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశాల మేరకు, నాల్కో అధికారులు లక్ష్మీపండా కుమారుడు నరేంద్ర పండా, కోడలు సుజాత, మనుమరాలు భర్త బుల్లు సాహు, మనవడు బబులా పండాలను భువనేశ్వర్ కు తీసుకెళ్లారు.
వారిని ప్రధాని మోదీ 16వ తేదీన స్వయంగా సత్కరించగా, అదే రోజు రాత్రి వీరంతా హిరాఖండ్ రైలులో వెనక్కు వెళ్లేందుకు భువనేశ్వర్ రైల్వే స్టేషనుకు వెళ్లి మాయమయ్యారు. ఆపై 17 రాత్రి లక్ష్మీపండా మనుమరాలు భర్త బుల్లు సాహు జయపురం చేరుకుని తనతో వచ్చిన మిగతావారంతా అదృశ్యమైనట్టు చెప్పడంతో, పోలీసు కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుని పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టగా, బాలేశ్వర్ ప్రాంతంలో సుజాత ఉన్నట్టు అధికారులు గుర్తించి, గురువారం నాడు ఆమెను జయపురం చేర్చారు. బబులా పండా ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు. ఇప్పుడీ ఘటన రాజకీయ రంగు పులుముకోగా, వీరంతా అదృశ్యం కావడానికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.