: జూలియన్ అసాంజే అరెస్టుకు పావులు కదుపుతున్న అమెరికా
వీకీలీక్స్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత విజిల్ బ్లోయర్ జూలియన్ అసాంజే అరెస్టుకు అమెరికా పావులు కదుపుతోంది. 2010లో అసాంజే వీకీలీక్స్ అమెరికాకు చెందిన అనేక సైనిక రహస్యాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటి అమెరికా ఆర్మీ నిఘా నిపుణుడు చెల్సియా మన్నింగ్ తస్కరించిన రహస్య పత్రాలను వీకీలీక్స్ వెలుగులోకి తెచ్చింది. ఇలా దేశ రహస్యాలను వెలుగులోకి తెచ్చినందుకు అసాంజేను చట్టపరంగా శిక్షించవచ్చా? లేదా? అన్న తర్జనభర్జన పడ్డ అమెరికా అధికారులు...ఆయనను చట్టపరంగా అరెస్టు చేయవచ్చని నిర్ధారణకు వచ్చారు.
దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ అభియోగాలు ఖరారు చేస్తోంది. లక్షలాది సైనిక రహస్య పత్రాలు లీక్ చేసిన ఎన్ఎస్ఏ మాజీ విశ్లేషకుడు ఎడ్వర్డ్ స్నోడన్ వెనుక ఉన్నది కూడా అసాంజేయేనని నిర్ధారణకు వచ్చిన అమెరికా అధికారులు ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు కేసుల్లో జూలియస్ అసాంజేను అరెస్టు చేయాలని నిర్ణయించారు. కాగా, అసాంజే లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.