: గరుడ బస్సు డ్రైవర్ అవతారమెత్తిన మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు కాసేపు గరుడ బస్సు డ్రైవర్ అవతారమెత్తారు. మరో మంత్రి గంటా శ్రీనివాస్, ఇతర ప్రభుత్వ అధికారులను ఎక్కించుకుని బస్సును విజయవాడ రోడ్లపై పరిగెత్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 100 ఏసీ బస్సులను కొనుగోలు చేయగా, వాటిల్లో 15 డెలివరీ అయ్యాయి. వీటిని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా ప్రారంభించారు. ఈ సందర్భంగానే అచ్చెన్నాయుడు కాసేపు బస్సు నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా ప్రారంభమైన బస్సుల్లో 9 విజయవాడ - హైదరాబాద్ మధ్య తిరుగుతాయని, 4 విజయవాడ - బెంగళూరు మధ్య, 2 బస్సులు విజయవాడ - చెన్నై మధ్య తిరుగుతాయని తెలిపారు. ఆర్టీసీని లాభాల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నామని, అందుకు ప్రతి ఒక్క ఉద్యోగీ సహకరించాలని కోరారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని బస్సు డిపోలకూ కొత్త ఏసీ బస్సులను అందించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.