: ధోనీని తప్పించిన విధానం నాకు నచ్చలేదు: సురేష్ రైనా
పూణే జట్టు కెప్టెన్సీ నుంచి మాజీ కెప్టెన్ ధోనీని తొలగించిన విధానం తనకు నచ్చేలేదని గుజరాత్ లయన్స్ కెప్టెన్, దోనీ మాజీ సహచరుడు సురేష్ రైనా తెలిపాడు. టీమిండియాకు ఎన్నో ఘనమైన విజయాలు సాధించిన పెట్టిన మాజీ కెప్టెన్ ధోనీతో పూణే జట్టు యాజమాన్యం వ్యవహరించిన విధానం సరిగాలేదని అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని తాను ఒక్కడినే చెప్పడం లేదని, యావత్ప్రపంచం చెబుతోందని రైనా తెలిపాడు. దేశ క్రికెట్ కు ఎంతో చేసిన ధోనీని గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నాడు. పూణే యాజమాన్యం అలా చేసి ఉండాల్సింది కాదని అన్నాడు. కాగా, పూణే జట్టు ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించి, స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా నియమించింది. స్మిత్ ఆరు రోజుల దుబాయ్ టూర్ కు వెళ్తుండడంతో ధోనీని కాదని, అజింక్యా రహానేను కెప్టెన్ గా నియమించింది. కాగా, గతంలో ధోనీ కెప్టెన్సీలో రహానే ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రహానే కెప్టెన్సీలో ధోనీ ఆడాల్సి వస్తోంది.