: ట్రంప్ వల్ల అమెరికాకు తొలి ఏడాది నష్టం 47,813 కోట్లు!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ దేశానికి తొలి ఏడాది నష్టం 47,813 కోట్ల 25 లక్షల రూపాయలని ఫిలడెల్పియాలోని టూరిజం ఎకనామిక్స్ తెలిపింది. అధ్యక్ష పీఠంపై కూర్చోగానే డొనాల్డ్ ట్రంప్ ముస్లిం దేశాలపై నిషేధం అంటూ ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయానికి బ్రేక్ పడినా...ఎయిర్ పోర్టుల్లో అధికారుల అత్యుత్సాహంతో ఈ సమాచారం ప్రపంచానికి చేరింది. దీంతో కేవలం ముస్లిం దేశాల నుంచి మాత్రమే కాకుండా న్యూజిలాండ్, ఐర్లాండ్, చైనా, రష్యా, మెక్సికో, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల నుంచి కూడా అమెరికా వెళ్లే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ట్రంప్ ముస్లిం బ్యాన్ తరువాత 35 శాతం బుకింగ్స్ తగ్గిపోయాయని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ చెబుతోంది.

అమెరికాకు వచ్చే ప్రయాణికులు ల్యాప్ ట్యాప్, ట్యాబ్ వంటివి తీసుకురాకూడదని ఆదేశించడంతో ఆ సంఖ్య మరింత తగ్గిపోయింది. దీంతో విమాన సర్వీసులను కుదించారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన మరుసటి రోజే 2000 విమాన సర్వీసులు రద్దయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని టూరిజం ఎకనామిక్స్ చెబుతోంది. 2016తో పోల్చితే 2017లో అమెరికాను సందర్శించే వారి సంఖ్య తగ్గుతుందని, 2018 నాటికి ఈ సంఖ్య ఇంకా తగ్గుతుందని టూరిజం ఎకనామిక్స్ అంచనా వేస్తోంది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ కారణంగా ఈ ఏడాది అమెరికా పర్యాటక రంగం 7.4 బిలియన్ డాలర్ల (47,813 కోట్ల 25 లక్షల రూపాయల) నష్టాన్ని చవిచూడనుందని టూరిజం ఎకనామిక్స్ తెలిపింది. దీంతో ట్రంప్ తొలి నిర్ణయం అమెరికాకు 47, 813 కోట్ల 25 లక్షల రూపాయల నష్టాన్ని మిగులుస్తుంది.  

  • Loading...

More Telugu News