: పన్నీర్ కోర్కెలతో బెంబేలెత్తుతున్న పళనిస్వామి.. విలీన చర్చల్లో ప్రతిష్టంభన!
రెండుగా చీలిన అన్నాడీఎంకే ఏకమవుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వర్గం కోర్కెలతో విలీన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఓపీఎస్ గొంతెమ్మ కోర్కెలను విని ముఖ్యమంత్రి పళనిస్వామి (ఈపీఎస్) వర్గం అవాక్కవుతోంది. గతవారం పళనిస్వామి-పన్నీర్ సెల్వం వర్గాల మధ్య జరిగిన చర్చల సందర్భంగా ముఖ్యమంత్రిగా ఈపీఎస్, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఓపీఎస్ ఉండాలని దాదాపు ఓ నిర్ణయానికొచ్చారు. ఇరు వర్గాల తరపున ఏర్పాటయ్యే కమిటీలు మిగిలిన పదవులను ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా పన్నీర్ వర్గం ముఖ్యమంత్రి పదవితోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఓపీఎస్‌కే ఇవ్వాలని, ఆర్కేనగర్ ఉప ఎన్నికల అభ్యర్థిగా తమ వర్గం నేత మధుసూదన్‌నే ప్రకటించాలని మెలికపెట్టింది.
అలాగే జయ మరణంపై విచారణతోపాటు తమ వర్గంలోని 11 శాసనసభ్యుల్లో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఈపీఎస్ వర్గం తలలు పట్టుకుంటోంది. తొలుత కుదిరిన ఒప్పందానికి విరుద్ధంగా కొత్త డిమాండ్లు సరికాదని ఓపీఎస్ వర్గానికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓపీఎస్ వర్గం బెట్టువీడకపోవడంతో విలీన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. విలీనం ఎటూ ఎడతెగకపోవడంతో సీనియర్ మంత్రి డి.జయకుమార్, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై గురువారం ఉదయం గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి విషయం వివరించినట్టు తెలుస్తోంది. తొలుత అంగీకరించినట్టుగా కాకుండా కొత్త డిమాండ్లతో పన్నీర్ సెల్వం తమను ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.