: గాలి జనార్దనరెడ్డి సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్‌బై?
కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ గనుల కేసులో జైలు పాలై ఏడాది క్రితం బయటకు వచ్చిన గాలి జనార్దనరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద ఆయన స్వయంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మరో సంవత్సరంలో కర్ణాటకలో ఎన్నికలు జరగనుండడంతో జనార్దనరెడ్డి బరిలోకి దిగుతారని అందరూ భావించారు. బళ్లారి, సింధనూరులో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అంతలోనే ఈ నిర్ణయం ఆయన అభిమానులను నిరుత్సాహానికి గురిచేసింది.
అయితే జనార్దనరెడ్డి తప్పుకునేది ప్రత్యక్ష రాజకీయాల నుంచి మాత్రమేనని, తెరవెనుక మాత్రం రాజకీయాలు కొనసాగుతాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల జరిపించిన కుమార్తె పెళ్లితో పలు సమస్యలు ఎదురయ్యాయని, ఇప్పటికే తనపై చాలా కేసులు ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి మరిన్ని కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడం ఇష్టంలేకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. రాజకీయాల్లోకి వచ్చి మంత్రి పదవి కూడా అనుభవించానని, ఇక కొత్తగా సాధించేది ఏమీ లేదని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ‘గాలి’ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.