: ఇంటి పేరు తెచ్చిన తిప్పలు..మహారాష్ట్ర మాజీ సీఎం కుమార్తెపై తప్పుడు ప్రచారం!
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే రెండో కుమార్తె ప్రీతి ష్రాఫ్ పై సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీని కంతటికి కారణం ఆమె ఇంటిపేరు ష్రాఫ్ గా ఉండటమే. గత సోమవారం పుణెలో ఫుట్ పాత్ పై నిల్చున్న వారిని ఓ మహిళ తన కారుతో ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఆ యాక్సిడెంట్ కు పాల్పడిన మహిళ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య. ఆమె పేరు సుజాత జయప్రకాశ్ ష్రాఫ్. షిండే కూతురు ప్రీతి ఇంటి పేరు కూడా ‘ష్రాఫ్’ కావడంతో.. ఈ యాక్సిడెంటు ప్రీతి ష్రాఫ్ చేసినట్టుగా సామాజిక మాధ్యమాలు వేదికగా ఆమెపై తప్పుడు ప్రచారం జరిగింది.
దీంతో, ప్రీతి, ఆమె భర్త మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో, ఆమెపై తప్పుడు ప్రచారానికి నెటిజన్లు స్వస్తి పలికారు. కాగా, ప్రీతి ష్రాఫ్ భర్త అయిన రాజ్ ష్రాఫ్ కాంగ్రెస్ నేత, వ్యాపారవేత్త. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, అసలు విషయం తెలుసుకోకుండా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదని, నిజానిజాలు తెలుసుకోకుండా తమపై నిందలు వేయడం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.