: గర్ల్ ఫ్రెండ్ ను విమానాల్లో తిప్పలేక.. విమానాలకు హైజాక్ బెదిరింపులు పంపిన హైదరాబాదీ
తన గర్ల్ ఫ్రెండ్ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక... పెద్ద తప్పు చేశాడు ఒక యువకుడు. వివరాల్లోకి వెళ్తే, వంశీ చౌదరి అనే వ్యక్తి హైదరాబాదులో ట్రాన్స్ పోర్ట్ ఏజెంట్ గా పని చేస్తున్నాడు. అతనికి ఓ ప్రియురాలు ఉంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతడిని... ముంబై, గోవాల టూర్లకు విమానంలో తీసుకెళ్లమంటూ ప్రియురాలు కోరింది. ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక... ఆమె టూర్ కు వెళదామని చెప్పిన రోజే విమానాశ్రయంలో హై అలర్ట్ విధించేలా ప్లాన్ వేశాడు. విమానాలను హైజాక్ చేస్తున్నట్టు పలు ఈమెయిళ్లను పంపించాడు. దీంతో, ఈ వారం ప్రారంభంలో హైదరాబాద్, ముంబై, చెన్నై విమానాశ్రయాల్లో హైఅలర్ట్ విధించారు.
ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మెయిల్స్ వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. ఎస్ఆర్ నగర్ నుంచి మెయిల్స్ వచ్చినట్టు గుర్తించారు. అనంతరం వంశీ చౌదరి అనే యువకుడిని అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ట్రిప్ క్యాన్సిల్ చేసుకుందామని తాను చెప్పినప్పటికీ తన ప్రియురాలు వినలేదని... అందుకే ఈ పని చేశానని తెలిపాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.