: ఉదయాన్నే తలుపు తెరవగానే.. తొమ్మిదడుగుల మొసలి ప్రత్యక్షం... షాక్ తిన్న యజమాని!
అమెరికా సౌత్ కరొలినాలోని మౌంట్ ప్లెజెంట్లోని ఓ అపార్ట్ మెంటులో ఉంటున్న ఓ వ్యక్తికి ఉదయాన్నే భయంకర అనుభవం ఎదురైంది. రెండో అంతస్తులో ఉంటున్న ఆయనకి తమ ఇంటి తలుపుతెరవగానే తొమ్మిది అడుగుల మొసలి కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. ఉదయాన్నే తమ ఇంటి ముందు ఏదో చప్పుడు వినిపించిందని, ఆ చప్పుడు ఎక్కువ కావడంతో ఎవరైనా దొంగలు తలుపు కొడుతున్నారా? అన్న అనుమానం వచ్చిందని ఆ ఇంటి యజమాని స్టీవ్ పాల్స్టన్ అన్నారు.
తాను జాగ్రత్తగా తలుపు తీసి చూస్తే, అక్కడో పెద్ద మొసలి నోరు తెరుచుకుని కనిపించిందని తెలిపారు. తమ ఇళ్లు 15 అడుగుల ఎత్తులో ఉంటుందని, ఆ మొసలి అన్ని మెట్లు ఎక్కుతూ వచ్చేసిందని ఆయన చెప్పారు. ఆ మొసలి దారిలో ఒక అద్దాన్ని కూడా పగలగొట్టిందని చెప్పారు. దానిని చూసిన షాక్ నుంచి తేరుకొని, అక్కడి నుంచి దాన్ని తరిమేయడానికి ఎంత ప్రయత్నించినా అది కదలేదని చెప్పారు. అనంతరం వన్యప్రాణి నిపుణులను పిలిపించామని అన్నారు. అక్కడకు చేరుకున్న వన్యప్రాణి నిపుణులకు సైతం దాన్ని పట్టుకోవడం వల్ల కాలేదు. దీంతో చివరికి దాన్ని చంపేశారు. ఆ మొసలికి సుమారు 60 ఏళ్ల వయసుంటుందని వారు అన్నారు.