: అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించకపోతే నాకు ఎస్ఎంఎస్ చేయండి: సీఎం చంద్రబాబు
అధికారులు, ప్రజా ప్రతినిధులు సహకరించకపోతే తనకు ఎస్ఎంఎస్ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురం జిల్లా పామిడిలో నీరు-ప్రగతి ఉద్యమ పైలాన్ ఆవిష్కరణ అనంతరం, చంద్రబాబు మాట్లాడుతూ, కష్టాలున్నా.. ఎక్కడా అధైర్యపడలేదని అన్నారు. గత ఏడాది రూ.570 కోట్ల ఇన్ పుట్ సబ్బిడీ ఇచ్చామని, ఈ ఏడాది రూ.1,030 కోట్లు ఇన్ పుట్ సబ్బిడీ, బీమా ఇస్తామని చెప్పారు. రైతులకు పెద్ద ఎత్తున రుణ మాఫీలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, గతంలో అనంతపురం జిల్లా నుంచే రైతు పోరుబాట ప్రారంభించామని, పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేయాలన్నదే తన ఆశయమని అన్నారు.
వర్షపు నీటి భూగర్భ జలాలుగా మార్చాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపు నిచ్చారు. అందరికీ నీటి భద్రత ఇవ్వాలని తన జీవితాశయంగా మార్చుకున్నానని చెప్పారు. 30 వేల చెక్ డ్యామ్ లలో పూడిక తీయాలని ఆదేశాలు జారీ చేశానని, మరో 20 వేల చెక్ డ్యామ్ లు నిర్మిస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలో లక్ష పంట కుంటలు తవ్వాలని, ఈ ఏడాది బీపీటీ, పేరూరు పనులు ప్రారంభిస్తామని, పోలవరం అసాధ్యమని చాలా మంది అన్నారని, మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని, 2018 నాటికి గ్రావిటీతో పోలవరం నుంచి నీళ్లిస్తామని చంద్రబాబు తెలిపారు.
నీరు-ప్రగతి ఉద్యమంపై 90 రోజుల పాటు ఆలోచించాలని, అనంతపురం జిల్లాలో 27 వేల హెక్టార్లకు బిందు సేద్యం సదుపాయం కల్పించామని, గ్రామాలు, పట్టణాల్లో వసతుల కల్పనకు అనేక కార్యక్రమాలు చేపట్టామని,యాభై శాతం రాయితీతో పశువుల దాణా ఇస్తున్నామని, జూన్ 2 లోపు ప్రతి ఇంటికీ వంట గ్యాస్ ఇప్పిస్తామని తెలిపారు. తాను నిరంతరం పని చేస్తానని, పనిలో తనకు విసుగుండదు, విరామం ఎప్పుడూ కోరుకోనని చంద్రబాబు అన్నారు.