: ముస్లిం పర్సనల్ లా బోర్డుపై సీపీఐ అసంతృప్తి.. మారాల్సిన అవసరం ఉందంటూ సూచన
ట్రిపుల్ తలాక్ వ్యవహారంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల సీపీఐ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాక్ కొనసాగుతుందని... అయితే, దీన్ని దుర్వినియోగపరిచేవారిని సమాజం నుంచి బహిష్కరిస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. ఈ ప్రకటనపై సీపీఐ స్పందిస్తూ... ట్రిపుల్ తలాక్ ఎంతమాత్రం న్యాయబద్ధమైనది కాదని తెలిపింది. ఈ నిబంధనను ఖురాన్ కాని, సహజ ధర్మాలు కాని విధించలేదని చెప్పింది. ముస్లిం వర్గాలలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని తాము భావిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నో ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాక్ ను అంగీకరించడం లేదని... భారత్ లోని కొన్ని ముస్లిం గ్రూపులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేసింది. ఈ విషయంలో ముస్లిం లా బోర్డు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉందని చెప్పింది.