: సుబ్రతోరాయ్ ఆస్తులపై కన్నేసిన టాటా, గోద్రేజ్, అదానీ... వేలానికి భారీ స్పందన!


సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుబ్రతోరాయ్ సొంత సంస్థ సహారా గ్రూప్ కు ఉన్న ఆస్తులను వేలం వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, రూ. 7,400 కోట్ల విలువైన 30 ఆస్తులను సొంతం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో కార్పొరేట్ కంపెనీలు ఆసక్తిని చూపుతున్నాయి. టాటా, గోద్రేజ్ సంస్థలతో పాటు అదానీ, పతంజలి వంటి కంపెనీలు కూడా పోటీలోకి దిగనుండటంతో, అనుకున్న లక్ష్యానికి మించి వేలానికి స్పందన రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఈ ఆస్తులను వేలం వేసే అధికారం రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియాకు అప్పగించిన సంగతి తెలిసిందే. సహారా గ్రూప్ అధీనంలోని ఖాళీ స్థలాలను కొనుగోలు చేసేందుకు నిర్మాణ రంగ సంస్థలైన ఓమాక్సీ, ఎల్ డెకో లతో పాటు పలువురు హై నెట్ వర్త్ ఇన్డివిడ్యువల్స్, ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కూడా ఆసక్తిని చూపుతోందని తెలుస్తోంది.

లక్నోలోని సహారా హాస్పిటల్ ను వేలానికి ఉంచగా, దాన్ని సొంతం చేసుకోవాలని అపోలో గ్రూప్ తనవంతు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. అయితే, వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు అట్టే సమయం లేకపోవడంతో, ఆస్తుల మదింపు, దాని విలువ లెక్కకట్టడం కొన్ని అవాంతరాలను సృష్టించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక విలువ ఉన్న నిర్మాణ రంగ లావాదేవీలను పూర్తి చేయాలంటే, కనీసం 2 నుంచి 3 నెలల సమయం అవసరమన్నది విశ్లేషకుల అంచనా.

ఇదిలావుండగా, పుణెలోని సహారా ల్యాండ్ బ్యాంక్ ను తాము కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నామని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోజ్ షా గోద్రేజ్ వ్యాఖ్యానించారు. వేలం ప్రక్రియ తొలి దశలోనే ఉన్నందున అంతకుమించి వ్యాఖ్యానించలేనని తెలిపారు. ఓమాక్సీ సీఎండీ రోహ్ తస్ గోయల్ సైతం కొన్ని ఆస్తులను సొంతం చేసుకునేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. కాగా, ఈ సంవత్సరం ఆగస్టులోగా రూ. 10,500 కోట్లను సహారా అధినేత కోర్టులో డిపాజిట్ చేయాల్సి వుందన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News