: చంద్రబాబుకు 'హ్యాపీ బర్త్ డే' చెప్పిన మోదీ
నేడు 68వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో జీవించాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. ఈ మేరకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు మరిన్ని సేవలను అందించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
ఇక చంద్రబాబును కలిసి స్వయంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలతో ఆయన నివాసం కళకళలాడుతోంది. చదలవాడ కృష్ణమూర్తి, కొల్లు రవీంద్ర, సండ్ర వెంకటవీరయ్య, యరపతినేని శ్రీనివాసరావు, టీటీడీ ఈఓ సాంబశివరావు తదితరులు ఆయన నివాసానికి వచ్చారు. కాగా, ఈ ఉదయం కాసేపు ప్రముఖుల నుంచి అభినందనలు అందుకున్న చంద్రబాబు, ఆపై అనంతపురం పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు.