: తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలకి ప్రత్యామ్నాయం బీజేపీయే: బండారు దత్తాత్రేయ
తమిళనాడులో అన్నాడీఎంకేలో ఏర్పడిన విభేదాలు, కేసులు, విలీనం వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపుతున్నాయి. తంజావూరు జిల్లాలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు తమిళనాడులో సరైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్, మాయావతిలకు అక్కడి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి బీజేపీకి అధికారం కట్టబెట్టారని ఆయన పేర్కొన్నారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలకు ఆదరణ లభిస్తోందని ఆయన తెలిపారు. అయితే ప్రధాని చేపడుతున్న పథకాలపై ప్రచారం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని ఆయన స్పష్టం చేశారు.