: అమెరికా, ఆస్ట్రేలియా దారిలోనే న్యూజిలాండ్ కూడా... ఇండియన్ టెక్కీలకు మరో కష్టం!
తమ దేశంలో ఉపాధి అవకాశాలను పెంచుకోవడానికంటూ, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు ఇప్పటికే విదేశీ ఉద్యోగులకు ఇచ్చే వీసాలపై ఆంక్షలను విధించగా, తాజాగా ఆ జాబితాలో న్యూజిలాండ్ కూడా చేరింది. ఈ మేరకు వీసా నిబంధనలను కఠినం చేస్తున్నట్టు ఆ దేశ ఇమిగ్రేషన్ శాఖ మంత్రి మైఖేల్ వుడ్ సౌస్ వెల్లడించారు. న్యూజిలాండ్ లోని చాలా కంపెనీలు విదేశీ ఉద్యోగులపై ఆధారపడి ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆయన, న్యూజిలాండ్ పౌరులకు ఉపాధి, అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వీసా నిబంధనల మార్పుల్లో భాగంగా అధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు వేతన పరిమితి పెంపు వంటి నిర్ణయాలు తీసుకోనున్నామని తెలిపారు. కాగా, న్యూజిలాండ్ లో కూడా విదేశీ వృత్తి నిపుణుల్లో, అందునా ఐటీ రంగంలో భారతీయులే అత్యధికులు. వీరందరిపైనా తాజా వీసా నిబంధనల మార్పు ప్రభావం పడనుంది.