: అక్టోబర్ లో నాగచైతన్య, సమంత పెళ్లి?
తెలుగు సినీ పరిశ్రమలో నాగచైతన్య, సమంత వివాహంపై పెద్ద చర్చ జరుగుతోంది. నిశ్చితార్థం ముగిసిన అనంతరం వివాహంపై ఇద్దరూ ఎలాంటి ప్రకటన చేయలేదు సరికదా, ఎవరి సినిమా షూటింగుల్లో వారు బిజీబిజీగా గడిపేస్తున్నారు. నిశ్చితార్థమైన తొలినాళ్లలో సమంత చైతూ గురించిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఆసక్తి రేపింది. తరువాత ఇద్దరూ మౌనంగా తమ పనిలో తాము నిమగ్నమైపోయారు. ఇప్పటికే అఖిల్ వివాహం రద్దు కావడంతో, అక్కినేని ఫ్యామిలీ అభిమానుల్లో తమ అభిమాన జంట వివాహం ఎప్పుడు? ఎక్కడ? జరుగుతుందా? వంటి అనుమానాలు నిండిపోయాయి.
ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ స్పందించకపోవడంతో వారి సన్నిహతుల సాయంతో చై, శామ్ వివాహం గురించిన వివరాలు తెలుస్తున్నాయి. వారిద్దరి వివాహం అక్టోబర్ లో ఉండే అవకాశం కనిపిస్తోందని వారు చెబుతున్నారు. అక్టోబర్ నాటికి వారి సినిమాల షూటింగ్ లు పూర్తవుతాయని, ఆ తరువాత కొన్ని రోజులు షూటింగ్ లకు విశ్రాంతినిచ్చి ఏకాంతంగా గడపనున్నారని తెలుస్తోంది. వారి వివాహం హైదరాబాదులో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.