: చంద్రబాబుతో మంత్రి అఖిల ప్రియ భేటీ
టీడీపీ నేత భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తారని ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ ఈ రోజు మరోసారి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు శిల్పా మోహన్ రెడ్డి తన సోదరుడితో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ అయి నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా తననే పోటీకి దింపాలని కోరారు. ఈ క్రమంలో మంత్రి అఖిల ప్రియ కూడా చంద్రబాబు వద్దకు వెళ్లి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... తన శాఖాపరమైన అంశంపై మాట్లాడేందుకే తాను సీఎంతో భేటీ అయ్యానని చెప్పారు. సీఎంతో శిల్పా సోదరులు చర్చిస్తున్నట్లు తనకు తెలియదని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.