: ఫత్వాపై నిరసన వ్యక్తం చేస్తూ గుండు కొట్టించుకున్న గాయకుడు సోనూ నిగమ్!
తనపై జారీ చేసిన ఫత్వాపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ స్వయంగా గుండు గీయించుకున్నాడు. అనంతరం, మీడియా ముందుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా సోనూ నిగమ్ మాట్లాడుతూ, ఏ మతానికి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేయలేదని, తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు తనకు ఉందని అన్నారు. అభివృద్ది చెందుతున్న సమాజంలో మనము ఉన్నామని, ఇంకా ఫత్వాలు జారీ చేయడమేంటని ప్రశ్నించారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని సోనూ నిగమ్ స్పష్టం చేశారు.
కాగా, మసీదుల నుంచి వచ్చే ప్రార్థనలు, లౌడ్ స్పీకర్ల ద్వారా వచ్చే ఉపన్యాసాలు, ప్రార్థనా పిలుపులు ‘గూండాగిరి’ అంటూ సోనూ నిగమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోల్ కతాకు చెందిన ఓ ముస్లిం మతగురువు స్పందిస్తూ.. సోనూ నిగమ్ కు గుండు కొట్టిన వారికి రూ.10 లక్షలు రివార్డుగా ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఓ ఫత్వా కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోనూ నిగమ్ స్పందిస్తూ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఇంట్లోనే ఉంటానని, ఎవరైనా వచ్చి తనకు గుండు చేయవచ్చని సవాల్ విసిరాడు. అయితే, సోనూ నిగమ్ స్వయంగా గుండు గీయించుకుని మీడియా ముందుకు వచ్చి తన నిరసన వ్యక్తం చేయడం గమనార్హం.