: హైదరాబాద్ హోటళ్లలో వడ్డిస్తున్న ఆహారపదార్థాలు ఈగలు, బొద్దింకలు వాలిన పదార్థాలే: పరిశోధనలో విస్తుపోయే నిజాలు
హైదరాబాద్ నగరంలో ఏది తినాలనిపించినా ఆహార ప్రియులకు భయం పట్టుకుంటోంది. అన్ని ఆహార పదార్థాలు కలుషితం బారిన పడుతుండడంతో ప్రజల ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లుతోంది. నగరంలో విక్రయిస్తోన్న పలు పదార్థాలపై జాతీయ పోషకాహార సంస్థలోని ఫుడ్ అండ్ డ్రగ్ టాక్సికాలజీ పరిశోధనా కేంద్రంలో జరిపిన అధ్యయనంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. హైదరాబాద్లో విక్రయిస్తోన్న పానీపూరీ, క్యారెట్, ఉల్లిగడ్డలు, సలాడ్లు, పండ్ల రసాలు కలుషితమేనని స్పష్టమైంది. క్యారెట్ లో 98.1 శాతం, ఉల్లిగడ్డల్లో 75.5 శాతం శాంపిళ్లలో బాక్టీరియాతో పాటు ఈకోలి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే హోటళ్లలో వడ్డిస్తున్న ఆహారపదార్థాలు ఈగలు, బొద్దింకలు వాలిన పదార్థాలని కనుగొన్నారు.
అక్కడ ఉంచుతున్న తాగునీరు కూడా కలుషితంగా ఉందని తేల్చి చెప్పారు. ఇక హైదరాబాదీలు ఎంతో ఇష్టంగా తినే పానీపూరీల్లోని నీరు కలుషితమేనని చెప్పారు. నగరంలోని హోటళ్లలో నుంచి సేకరించిన 163 సలాడ్లు, 150 పండ్ల రసాలతో పాటు 150 పానీపూరీ సెంటర్ల నుంచి శాంపిళ్లను సేకరించి ఈ పరిశోధన చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. హోటళ్లు, రోడ్డుపై లభించే ఆహారపదార్థాలే కాకుండా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లలో లభించిన సాఫ్ట్ డ్రింకులు, సోడాల్లో కూడా ఈకోలి, బాక్టీరియా ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ ఆహారపదార్థాలు తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నవారిమే అవుతాం.