: స్నాప్ చాట్ కు చురకలంటించిన ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్


స్నాప్ చాట్ సీఈవో పొగరుతో, అహంకారంతో చేసిన వ్యాఖ్యలు ఆ సంస్థను భారతీయులకు దూరం చేశాయి. భారతదేశంలాంటి పేద దేశంలో స్నాప్ చాట్ వ్యాపార విస్తరణ అవసరం లేదని... తమ యాప్ కేవలం డబ్బున్న వారికేనంటూ ఆ సంస్థ సీఈవో ఇవాన్ స్పీగల్ ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో భారతీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్పీగల్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతీయులకు స్నాప్ చాట్ లాంటి చెత్త యాప్ లు అవసరం లేదంటూ మండిపడ్డారు. దీంతో, తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు స్పీగల్.

ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ, స్నాప్ చాట్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఫేస్ బుక్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టెక్నాలజీ అనేది ఉన్నత స్థాయిలో ఉన్న వారికి మాత్రమే కాదని అన్నారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడాలని చెప్పారు. ఫేస్ బుక్ ఉన్నత వర్గాలవారికి మాత్రమే కాదని... అందరి కోసం అని తెలిపారు.

  • Loading...

More Telugu News