: న్యాయపోరాటంలో మేమే గెలిచాం...కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయి: పన్నీరు సెల్వం
న్యాయపోరాటంలో మేమే గెలిచామని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీరు సెల్వం ప్రకటించారు. చెన్నైలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గంతో చర్చలు పూర్తయిన అనంతరం పన్నీరు సెల్వం మాట్లాడుతూ, అన్నాడీఎంకేలో కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయని ప్రకటించారు. తమిళనాడు ప్రజల కోరిక మేరకు నడుచుకుంటామని ఆయన తెలిపారు. పార్టీలో దినకరన్, శశికళ లేరని ఆయన తెలిపారు. మన్నార్ గుడి మాఫియాకు చెక్ చెప్పామని ఆయన స్పష్టం చేశారు.
కాగా, పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాల మధ్య సాయంత్రం మరోసారి సమావేశం జరగనుందని తెలుస్తోంది. ఇందుకోసం 12 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని పన్నీరు సెల్వంకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. సీఎం పదవిలో పళనిస్వామిని కొనసాగించాలని అతని వర్గం కోరుకుంటుండగా, అలా అయితే శశికళ వర్గం ఇంకా పార్టీలోనే ఉందనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, అలా జరగకుండా ఉండాలంటే ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వంనే నియమించాలని పన్నీరు సెల్వం వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నేటిసాయంత్రానికి ఒక స్పష్టత రానుందని తెలుస్తోంది.